మెగా కుటుంబంతో... బోయపాటి శ్రీనుకి మంచి సంబంధాలున్నాయి. సరైనోడు లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు బన్నీకి. రామ్ చరణ్ `వినయ విధేయ రామ` ఫ్లాప్ అయ్యింది గానీ, లేదంటే.. ఈపాటికి చిరంజీవితో కూడా ఓ సినిమా చేసేసేవాడు బోయపాటి. చిరు- బోయపాటితో గీతా ఆర్ట్స్ అప్పట్లో ఓ సినిమా ప్రకటించింది. చిరు 151వ చిత్రం అదే కావాలి. కానీ కుదర్లేదు. అలా గీతా ఆర్ట్స్ బోయపాటికి ఓసినిమా బాకీ పడిపోయింది.
ఆ బాకీ ఇప్పుడు బన్నీ తీర్చడానికి రెడీ అయ్యాడు. అవును.. గీతా ఆర్ట్స్ లో బోయపాటి దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. సరైనోడు తరవాత.. ఈ కాంబో మళ్లీ పట్టాలెక్కలేదు. అన్నీ కుదిరితే.. పుష్ష తరవాత బన్నీ సినిమా ఇదే కావొచ్చు. పుష్ష తరవాత ఎవరితో సినిమా చేయాలి? అనే విషయంలో బన్నీ తర్జన భర్జనలు పడుతున్నాడు. వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి లాంటి బలమైన ఆప్షన్లు రెడీగా పెట్టుకున్నాడు. ఈ ముగ్గురిలో ఎవరి కథ ఓకే అయితే... వాళ్లతో ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది.