స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్, ఇప్పటికే పలు సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం 'ఏబీసీడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'ఏబీసీడీ' అంటే, 'అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' అని. ఈ సినిమా షూటింగ్ సింహభాగం విదేశాల్లోనే జరుగుతుందని సినిమా సెట్స్ మీదకు వెళ్ళే ముందే క్లారిటీ ఇచ్చేశారు.
ఆ సంగతి పక్కన పెడితే, అల్లు శిరీష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అందులో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపిస్తున్నారు. 'నవ సమాజ్ పార్టీ' అనే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో నటిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. తనకు షూటింగ్ లేకపోయినా, సీనియర్ నటుడ్ని కలిసేందుకు సెట్స్‌కి వచ్చినట్లు పేర్కొన్నాడు శిరీష్.
ఇంతకీ, అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీకి రాజకీయాలతో సంబంధం ఏంటట.? అదే మరి, సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అది ఇప్పుడే రివీల్ అయ్యే అవకాశం లేదు. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన 'కృష్ణార్జున యుద్ధం' ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.