అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు కుటుంబం ఓ భారీ ప్రాజెక్టుకి శ్రీరాకం చుట్టింది. `అల్లు స్టూడియో`ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. భారీ స్థాయిలో ఈ స్టూడియోని నిర్మిస్తామని అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ స్టూడియో ఎక్కడ? పనులు ఎప్పుడు మొదలవుతాయి? అనే విషయాల్లో క్లారిటీ రానుంది.
`ఆహా` పేరుతో అల్లు అరవింద్ ఓటీటీ వేదిక ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆహా ఇప్పటికే కొన్ని సినిమాల్ని కొనేసింది. మరి కొన్ని సినిమాలలో బేరం పెట్టుకుంది. ఆహా కోసం వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. వీటన్నింటికీ `అల్లు స్టూడియో` వేదిక కాబోతోంది. రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్ థియేటర్, ఫ్లోర్లూ... ఇలా ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్‌కి కావల్సిన అన్ని సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ స్టూడియోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.