7/G బృందావన కాలనీ.. ఓ తరాన్ని ఊపు ఊపేసిన సినిమా. 2004లో విడుదలైన ఈ చిత్రం అపూర్వ విజయాన్ని అందుకొంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు అయితే సూపర్ డూపర్ హిట్. క్లైమాక్స్ ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఏ.ఎం.రత్నం నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రం బాషా బేధం లేకుండా, ప్రతీ చోటా హిట్టయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వల్ రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత ఏ.ఎం.రత్నం ధృవీకరించారు. అయితే దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ల పేర్లేంటి? అనేది మాత్రం చెప్పలేదు. 90 శాతం ఈ చిత్రానికి సెల్వ రాఘవనే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఓ కొత్త జంటతో ఈ చిత్రాన్ని రూపొందించవచ్చు.
ప్రస్తుతం ఏ.ఎం.రత్నం పవన్ కల్యాణ్ తో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేస్తారు. పవన్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ `ఖుషి`ని ఈనెల 31న రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రీ రిలీజ్ చేస్తున్నారు. అలానే 7/G బృందావన కాలనీని కూడా రీ రిలీజ్ చేస్తే బాగుంటుందేమో..? ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. మరి రత్నం ఆలోచనలు ఎలా ఉన్నాయో...?