డస్కీ బ్యూటీ అమలాపాల్, ఓ కారు వివాదంలో ఇరుక్కుంది. ట్యాక్స్ ఎగ్గొట్టి అడ్డదారిలో ఖరీదైన కారుని కొనుగోలు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలోగల పోలీస్ స్టేషన్‌లో ఆమె లొంగిపోయింది. తప్పుడు చిరునామాతో కారు కొనుగోలు చేసి, పన్ను ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
అయితే ఆ ఆరోపణలపై గతంలో స్పందించిన అమలాపాల్, తాను భారతీయురాలిననీ దేశంలోని వివిధ భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ, ఆర్థికంగా స్థిరపడ్డాననీ ఈ క్రమంలో తాను పన్నులన్నీ సక్రమంగానే కడుతున్నానని చెబుతూ ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని సుదీర్ఘ వివరణ ఇచ్చింది. కానీ పోలీసుల యెదుట ఆమె లొంగిపోవడం చూస్తుంటే ఎక్కడో తప్పు జరిగినట్లే అర్థమవుతుంది. లొంగిపోయిన అనంతరం, తప్పుడు పత్రాలతో కారు కొనుగోలు చేసినట్లు ఆమె ఒప్పుకుందని సమాచారమ్. అయితే దీనిపై పెదవి విప్పేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనించదగ్గ అంశం.
తెలుగులో 'బెజవాడ', 'నాయక్' తదితర సినిమాల్లో నటించింది అమలాపాల్. తెలుగులోనే కాక, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ డస్కీ బ్యూటీ. ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి, అంతలోనే వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా తక్కువ కాలంలోనే భర్త నుండి విడాకులు పొందింది అమలాపాల్. పెళ్ళికి ముందుతో పోల్చితే పెళ్ళయ్యాక హాట్ అప్పీల్ విషయంలో కొంచెం డోస్ పెంచేసింది ఈ బ్యూటీ.
ఆ సంగతి అలా ఉంచితే తాను ఏ తప్పు చేయలేదని ఇంతకు ముందు బుకాయించిన అమలాపాల్, కేసులో అడ్డంగా బుక్ అయిపోవడంతోనే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమవడంతోనే న్యాయస్థానంలో ఇలా ఆమె లొంగిపోయింది.