నటీనటులు : శ్రీకాంత్ అయ్యంగర్,విజయ్ రామ్, శివ్ శక్తి సచ్‌దేవ్ తదితరులు
దర్శకత్వం : జోనాథన్ వెసపోగు
నిర్మాతలు : ప్రసాద్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : రసూల్ ఎల్లోర్
ప్రేమలో ఎన్నో కోణాలు. ఒకొక్కరిదీ ఒక్కో వ్యూ. అందుకే ప్రేమకథలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటాయి. కొత్త దర్శకుడు, కొత్త టీమ్‌తో వస్తున్నాడంటే - తప్పకుండా ప్రేమ కథే అయ్యింటుంది. `అమరం అఖిలం ప్రేమ` కూడా ఓ ప్రేమకథే. ఆ విషయం టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. మరి ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కోణం ఏమిటి? ఈ ప్రేమకథతో చెప్పిందేమిటి? ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది `అమరం అఖిలం ప్రేమ`. మరి ఈ సినిమా ఎలా వుంది? ఎవరికి నచ్చుతుంది?
* కథ
అరుణ్ ప్రసాద్ (కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్) కి తన కూతురు అఖిల (శివ శక్తి) అంటే పంచ ప్రాణాలు. అఖిలకూ అంతే. అఖిల తెలివైన పిల్ల. అందుకే ఐఏఎస్ చేయాలనుకుంటాడు. కానీ... అఖిల మాత్రం ఇంజనీరింగ్ ఎంచుకుంటుంది. అఖిల కోసం.. అరుణ్ ప్రసాద్ అందుకు ఒప్పుకుంటాడు కూడా. కానీ... ఈ తండ్రీ కూతర్ల అనుబంధానికి `ప్రేమ` అడ్డుగోడలా నిలుస్తుంది. తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచుతుంది. తండ్రికి మళ్లీ దూరం కావాలన్న ఆశతో.. ఇంజనీరింగ్ అయ్యాక ఐఏఎస్ లో కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వస్తుంది అఖిల. ఇక్కడ అమర్ (విజయ్ రామ్) అఖిల ప్రేమలో పడిపోతాడు. తనకు దగ్గర అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ ఇంటికి పనివాడిగానూ మారిపోతాడు. మరి.. అఖిల.. అమర్ కి దగ్గరైందా? అసలు తండ్రీ కూతుర్ల మధ్య దూరం ఎందుకొచ్చింది? అమర్ ప్రేమ గొప్పదా? తండ్రి ప్రేమ గొప్పదా? చివరికి అఖిల ఎవరి ప్రేమ కావాలనుకుంది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించేనంత ప్రేమ ఓ తండ్రి కూతురుకి ఇవ్వడం, ఆ ప్రేమే ఆ కూతురి భవిష్యత్తుని శాశించడం ఇది వరకు కొన్ని కథల్లో చూశాం. తండ్రి ప్రేమకు పరాకాష్ట అయిన సినిమాలు కొన్ని వచ్చాయి. ఆకాశమంత, నువ్వే నువ్వే ఆ కోవలో కథలే. మళ్లీ అలాంటి తండ్రి ప్రేమనే పాయింట్ గా చేసుకున్నాడు దర్శకుడు. ఆ రకంగా.. ఈ పాయింట్ పాతదే. దానికి కొత్త ట్రీట్ మెంట్ అవసరం. కానీ.. దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాల్లో అది కనిపించదు. కథంతా సో.. సోగా సాగుతుంటుంది. చూడ్డానికి మరీ ఇబ్బంది కరంగా ఉండదు కానీ.. `ఇందులో కొత్తేముంది` అనిపిస్తుంటుంది. కథలో ఎమోషన్‌కి కనెక్ట్ అయితే.. సినిమాని ఈజీగా ఫాలో అయిపోవొచ్చు గానీ, కనెక్ట్ అవ్వని వాళ్లకైతే చాలా ఇబ్బంది. ఏదశలోనూ కథ, కథనాలపై ఉత్కంఠత కలగదు. `ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రస్ట్ర్` లేనే లేదు. పతాక సన్నివేశాల్లో ఏం జరుగుతుందో ముందే ఊహించగలం.
లవ్ ట్రాక్ కూడా సాదాసీదాగా సాగుతుంది. అఖిలని ప్రేమించడానికి అమర్ దగ్గర ఎలాగైతే రీజన్ ఉండదో... అమర్ ప్రేమలో పడిపోవడానికి అఖిల దగ్గర కూడా అలానే రీజన్ ఉండదు. తన తప్పు తెలుసుకుని, మళ్లీ తన దగ్గరకు వచ్చిన కూతుర్ని క్షమించపోవడానికీ ఆ తండ్రి దగ్గర రీజన్ ఉండదు. అమర్ వచ్చి మూడు నిమిషాల క్లాస్ పీకేదాకా.. ఆ తండ్రి మనసు కరగదు. ఇదంతా కథని క్లైమాక్స్ వరకూ లాగడానికే అనేది అర్థం అవుతూనే ఉంటుంది. అయితే.. కథలోని ఎమోషన్ అక్కడక్కడ వర్కవుట్ అవ్వడం, పాత్రల మధ్య ఘర్షణ పండడం, నటీనటులంతా బాగా చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ .. నిజాయతీగా ఆవిష్కరించడం వల్ల.. `అమరం అఖిలం ప్రేమ` బోర్ కొడుతున్నా... చూడగలుగుతాం.
* నటీనటులు
విజయ్ రామ్ కి ఇది తొలి సినిమా. నిర్మాత కూడా తనే అవ్వడం వల్ల ఈజీగా హీరో అయిపోయాడు. నటన పరంగా లోపాలేం లేవు. బాగా చేశాడు. కాకపోతే.. లుక్ పరంగా మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఈ పాత్రలో మరో యువ హీరో ఉంటే.. మరింత మంచి ఫలితం ఉండేదేమో. అఖిలగా శివ శక్తి కూడా బాగా నటించింది. అందగత్తై కాదు గానీ, చూడ్డానికి బాగుంది. బుద్ధిమంతురాలిగా ఇమిడిపోయింది. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రతిభకు తగిన పాత్ర దక్కింది. అన్నపూర్ణకు చాలా కాలం తరవాత.. అనుభవానికి తగిన పాత్ర ఇచ్చారు.
* సాంకేతిక వర్గం
రథన్ పాటలు వినసొంపుగానే ఉన్నాయి. నేపథ్య సంగీతంలో కొన్ని హిందీ సినిమా బిట్లు వినిపించాయి. రసూల్ ఫొటోగ్రఫీ మరో ఆకర్షణ. మాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిలో విషయం ఉంది. కాకపోతే.. ఇలాంటి రొటీన్ కథని ఎంచుకోకుండా ఉండాల్సింది. చిన్న సినిమా, పరిమిత బడ్జెట్ లో తీసిన ఫీలింగ్ కలగదు. ఎందుకంటే.. ఈ కథని ఇలా చెప్పడమే బాగుంది.
* ప్లస్ పాయింట్స్
పతాక సన్నివేశాలు
తండ్రీ కూతుర్ల అనుబంధం
* మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
బోరింగ్ సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్: కొంచెం నిదానం.. కొంచెం నీరసం