థియేటర్లపై ఓటీటీలు ఆధిపత్యం చూపిస్తున్న రోజులు ఇవి. కరోనా సమయంలో, థియేటర్లు పూర్తిగా మూసుకుపోతే - ఓటీటీలు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. క్రమంగా.. థియేటర్ల స్థానాన్ని ఆక్రమించుకోవడం మొదలెట్టాయి. సినిమా థియేటర్లో రిలీజ్ అయినా కూడా.. చాలా త్వరగా ఓటీటీలకు వెళ్లిపోతున్నాయి. `కేవలం ఓటీటీ కోసమే` అనే పద్ధతిపైనా కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.
సినిమా పూర్తయ్యాక - ఓటీటీలో విడుదల చేస్తే లాభసాటిగా ఉంటుందనిపిస్తే - నిర్మాతలు ఓటీటీకే వెళ్లిపోతున్నారు. టక్‌జగదీష్, నారప్పలు ఆ పద్ధతిలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు భీమ్లా నాయక్ కీ కూడా అదిరిపోయే రేటు వచ్చిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా రూపొందిన చిత్రమిది. సాగర్ దర్శకుడు. త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోగా.. ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అమేజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 150 కోట్లకు ఈ సినిమా కొంటామని ముందుకు వచ్చిందట. నిజంగానే ఇది టెమ్టింగ్ ఆఫర్
కరోనా సెకండ్ వేవ్ కి ముందు `వకీల్ సాబ్` వచ్చింది. ఆ సినిమా దాదాపు 100 కోట్లు సాధించింది. అంతకంటే ఇది పెద్ద మొత్తమే. కాబట్టి.. ఇచ్చేయొచ్చు. ఏపీలో పవన్ సినిమాల్ని అడ్డుకునే ప్రయత్నాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే భీమ్లా నాయక్ పై ఆ ప్రభావం ఉండొచ్చు. అలా జరిగితే.. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే పవన్ కూడా నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని `ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు` అని చెప్పేశాడట. నిర్మాతలకూ ఇది సరైన బేరమే అనిపిస్తే... ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడం ఖాయమైపోయినట్టే.