ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ కీలకమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఎంచుకున్నారు. బిగ్ బీ రాక.. ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని ఒక్కసారిగా రెట్టింపు చేసేసింది. అయితే.. అందుకోసం అమితాబ్ కి ఏకంగా పాతిక కోట్లు పారితోషికంగా ముట్టజెబుతున్నారన్న మాట కూడా షాకింగ్ కలిగించేదే.
మరోవైపు.. అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ కూడా... భారీగానే పారితోషికాన్ని బాదేస్తోంది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `అంధాధూన్` చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నితిన్ కథానాయకుడిగా నటిస్తే, తమిళంలో ప్రశాంత్ చేస్తున్నాడు. టబు చేసిన పాత్రకు తెలుగులో తమన్నాని ఎంచుకుంటే, తమిళంలో ఐశ్వర్యరాయ్ పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం ఐశ్వర్య ఏకంగా పది కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. నిజానికి బాలీవుడ్ లో ఐశ్వర్యరాయ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ దశలో సౌత్ నుంచి ఆఫర్ వచ్చింది. వీలైనంత తక్కువ పారితోషికం ఐష్ కి ఇచ్చి, ఈ సినిమాకి క్రేజ్ రావాలని తమిళ దర్శక నిర్మాతలు భావిస్తుంటే, ఈ నిర్మాతల నుంచి వీలైనంత ఎక్కువ రాబట్టాలని ఐశ్వర్యరాయ్ స్కెచ్ వేస్తోందట. మొత్తానికి మామా కోడళ్లిద్దరూ భారీ పారితోషికాలతో.. నిర్మాతలకు గుబులు పుట్టిస్తున్నారన్నమాట.