టాలీవుడ్ స్టార్ల పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. పారితోషికాలు తగ్గించుకుంటూ వెళ్లండి - అని కొంతమంది నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా, ఎవరికి దక్కాల్సింది వాళ్లకు దక్కుతూనే వుంది. తాజాగా ప్రభాస్ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ ని 25 కోట్లు పోసి తెచ్చినట్టు టాక్ నడుస్తోంది. ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారు.
ఆయనకు ఈ సినిమా కోసం 25 కోట్లు ఇచ్చినట్టు టాక్. ఆయనకే అంత ఇస్తే... మరి ప్రభాస్‌కి ఎంత ఇచ్చినట్టు? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ ఒప్పుకోవాలే గానీ, ఎంత పారితోషికం ఇవ్వడానికైనా జనాలు రెడీనే. సాహో సొంత సినిమా కాబట్టి, అందులో ప్రభాస్‌పారితోషికం ఎంత? అన్నది బయటకు రాలేదు. నాగ అశ్విన్ చిత్రానికి అశ్వనీదత్ ప్రొడ్యూసర్. కాబట్టి... బాహుబలి తరవాత బయట నిర్మాత సినిమాలో చేయడం ప్రభాస్‌కి ఇదే తొలిసారి.
ఈ సినిమా కోసం ప్రభాస్‌కి దాదాపు 100 కోట్ల వరకూ పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఆ తరవాత లాభాల్లో వాటా ఇవ్వడానికి సైతం అశ్వనీదత్ రెడీ అయ్యారని తెలుస్తోంది. మరికొందరైతే నైజాం, ఓవర్సీస్ హక్కులు రెండూ ప్రభాస్ దగ్గరే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది నిజమైనా సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకులలో నెంబర్ వన్ స్థానంలోకి చేరిపోతాడు ప్రభాస్. అందుకు ప్రభాస్ అర్హుడు కూడా.