ప్రాజెక్ట్ కె సెట్లో తనకు గాయాలయ్యాయని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అంతా ఇదే చర్చ. బిగ్ బితో గాయాలపాలయ్యేలా.. యాక్షన్ సీన్లు ఏం చేయించి ఉంటారా? అంటూ మాట్లాడుకొంటున్నారు. అమితాబ్ వయసు ఇప్పుడు 80 ఏళ్లు. ఈ వయసులో యాక్షన్ సీన్లు చేయడం అంటే అంత కంటే రిస్కీ పని ఇంకోటి ఉండదు. అమితాబ్ కోలుకోవడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. ఆ తరవాత.. ఆయన మళ్లీ యధావిధిగా సెట్ కి వస్తారు. కాకపోతే.. అమితాబ్ యాక్షన్ సీన్లకు ఒప్పుకొంటారా? ప్రాజెక్ట్ కె షూటింగ్ కి ఇది వరకటిలా సహకరిస్తారా? అనేది పెద్ద డౌటు.
బిగ్ బీ షూటింగులకు ముంబై వదిలి రావడం లేదు. కాకపోతే.. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీ ఆయనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ప్రాజెక్ట్ కె సెట్లు కూడా అక్కడే వేశారు. అమితాబ్ కి సంబంధించిన షూటింగ్ అంతా అక్కడే జరుగుతుంది. గాయం తరవాత మళ్లీ ఆయన హైదరాబాద్ రావడానికి ఇష్టపడతారా? అనేది పెద్ద అనుమానం. అమితాబ్ చేతినిండా సినిమాలుంటాయి. ఆయన నెల రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల.. కాల్షీట్లు గందరగోళంలో పడతాయి. తిరిగి ప్రాజెక్ట్ కెకి ఆయన ఎప్పుడు కాల్షీట్లు ఇస్తారో తెలీదు. మళ్లీ ఆయన ప్రాజెక్ట్ కె సెట్‌కి ఎప్పుడు వస్తారో అర్థం కావడం లేదు. ఇదంతా.. ప్రాజెక్ట్ కె విడుదల తేదీపై ప్రభావం చూపించే విషయాలే. దాంతో అశ్వనీదత్ తో పోటు, ప్రాజెక్ట్ కె టీమ్ మొత్తం కంగారు పడుతోందని సమాచారం. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ఏమాత్రం రిలీజ్ డేట్ ఆలస్యమైనా... వడ్డీ రేట్లు తడిసిమోపెడు అవుతాయి. దత్ భయం కూడా అదే.