ఎంతటి సూపర్ స్టార్ అయినా కరోనాకు లోకువే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ మహమ్మారి.. అమితాబ్ బచ్చన్ నీ వదిలి పెట్టలేదు. ఆయనకూ నిద్ర లేని రాత్రుళ్లు మిగులుస్తోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలోని తన అనుభవాల్ని తన బ్లాగ్ లో రాసుకొచ్చారు బిగ్ బీ. అర్థరాత్రి... చలికి విపరీతంగా వణికిపోయేవాడినని, నిద్ర లేక.. ఒక్కడినే ఒంటరిగా పాటలు పాడుకుంటున్నానని.. తన అనుభవాల్ని వివరించారు.
తనని చూడడానికి ఎవరూ వచ్చే పరిస్థితి లేదని, వైద్య సిబ్బంది కూడా.. ఒళ్లంతా ముసుగు వేసుకుని తనకి సపర్యలు చేస్తున్నారని, వాళ్లని చూస్తే రోబోల్లా అనిపిస్తున్నారని, వైద్యులు కూడా ఆన్ లైన్ లోనే తనకు సలహాలు, సూచనలూ అందిస్తున్నారని చెప్పుకొచ్చారు అమితాబ్. ఈ వ్యాధి వైద్య రంగానికే ఓ సవాల్ విసిరిందని, ప్రపంచం అంతా ఇదే పరిస్థితి నెలకొందని, త్వరలోనే ఈ వ్యాధి నుంచి ప్రపంచానికి ఉపశమనం లభించాలని దేవుడ్ని కోరుకుంటున్నానని అన్నారు బిగ్ బీ. ఆయన పరిస్థితే అలా ఉంటే.. సామాన్యుడి వేదన ఇంకెంత ఘోరంగా ఉంటుందో కదా?