థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అంటూ సినీ అభిమానులు, నిర్మాతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 1 నుంచి థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. మార్గ దర్శకాలు మాత్రం కఠినంగా ఉండబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అన్ లాక్ 3 ప్రారంభం అవుతుంది. ఈసారి.. థియేటర్లకు అనుమతులు రావొచ్చన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే... థియేటర్లో 25 శాతం సీట్లకే అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 50 శాతం సిట్టింగ్ తో థియేటర్లు తెరచుకోమంటేనే.. నిర్మాతలు అభ్యంతరం చెబుతున్నారు.
ఆక్యుపెన్సీ తగ్గే కొద్దీ.. వసూళ్లు తగ్గిపోతాయి. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడం అసాధ్యంగా మారుతుంది. 25 శాతం అంటే.. ఇంకెందుకు? అనే నిర్లిప్తత మొదలవుతుంది. 25 శాతం మాత్రమే సిట్టింగ్ అయితే... నిర్మాతలు సైతం తమ సినిమాల్ని విడుదల చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. తొలుత 25 శాతం సీట్లకు అనుమతి ఇచ్చి, ఆ తరవాత 50 శాతానికి పెంచే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉంది. థియేటర్ల యజమానులు, నిర్మాతలు అయితే 50 శాతం టికెట్లు అమ్ముకునే అనుమతులు వచ్చేంత వరకూ ఆగాలనే చూస్తారు.
పైగా టికెట్లు అమ్మేది 25 శాతం అయినా, వంద శాతం అయినా.. నిర్వహణ ఖర్చు, సిబ్బంది జీతాలూ ఒక్కటే. పైగా శానిటైజేషన్ పాటించడానికి మరింత..ఖర్చవుతుంది. అందుకే 25 శాతం సిట్టింగ్ తో ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా- థియేటర్లు తెరచుకునే అవకాశాలు ఏమాత్రం లేవు.