అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్‌మెన్.... ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలతో తనదంటూ ఓ మార్క్ సృష్టించుకొన్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. స్వతహాగా మంచి రచయిత అయిన ఇంద్రగంటికి కామెడీపై మంచి పట్టుంది. అది.. `అష్టాచమ్మా`లోనే కనిపించింది. `అష్టాచమ్మా` తరవాత ఇంద్ర గంటి చేసిన మరో వినోదాత్మక ప్రయత్నం `అమీతుమీ`. అవసరాల శ్రీనివాస్, అడవిశేష్ కథానాయకులుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం జూన్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ టాక్ చూస్తే.... ఇంద్రగంటికి మరో హిట్ ఖాయమనిపిస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, అష్టాచమ్మా తరహాలోనే మరో హిట్ దక్కించుకొంటుందని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంద్రగంటి కామెడీని బాగా పండించాడని, వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని తెలుస్తోంది. పరిమిత బడ్జెట్‌లో తీయడం వల్ల.. బిజినెస్ పరంగా, ఆర్థిక పరంగా ఈ సినిమా ముందే గట్టెక్కేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా సినిమా తీయడం ఎలాగో ఇంద్రగంటికి బాగా తెలుసు. సో... ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైతే... అమీ తుమీ బాక్సాఫీసు దగ్గర హిట్ అయిపోయినట్టే.