చిత్రసీమలో అనుబంధాలన్నీ చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న మాటకే పుటుక్కున తెగిపోతుంటాయి. అలానే కొన్ని కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా బలపడిపోతాయో కూడా చెప్పలేం. ఈసారి మాత్రం... ఓ అనుబంధానికి బీటలు వారింది. నితిన్, అమ్మ రాజశేఖర్ లు మంచి దోస్తులు. కానీ ఇప్పుడు అమ్మ రాజశేఖర్ నితిన్‌పై గుర్రుగా ఉన్నాడు. ఓ సినిమా ఫంక్షన్‌లో నితిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు అమ్మ రాజశేఖర్. ఆయన కోపానికి కారణం.. తన ఫంక్షన్‌కి నితిన్ ని పిలిచినా రాకపోవడమే.
అమ్మ రాజశేఖర్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మాతగా ఓ సినిమా రూపుదిద్దుకొంది. ఈ ఫంక్షన్‌కి నితిన్ ని పిలిచాడు. నితిన్ వస్తా అని చెప్పి, చివరి నిమిషంలో `జ్వరంగా ఉంది.. రాలేను` అన్నాడట. దాంతో అమ్మ రాజశేఖర్ అప్ సెట్ అయ్యాడు. తన అసంతృప్తి మొత్తం.. ఈ వేదికపై చూపించేశాడు. ``నితిన్‌కి డాన్స్ రాదు. తనని నేనే డాన్స్ నేర్పించాను. డాన్స్ నేర్పిన గురువుని మర్చిపోయాడు. అమ్మని, గురువుల్ని మర్చిపోయిన వాళ్లు ఎదగలేరు. నితిన్ కోసం అన్నం కూడా తినకుండా ఓ ఏవీ చేయించాను.
తను షూటింగుకి వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి.. రాలేదు. ఈరోజు చాలా బాధగా ఉంది. నన్ను నితిన్ బాగా నిరాశపరిచాడు. మేమిద్దరం చాలా క్లోజ్. అలాంటిది నేను పిలిచినా రాలేదు.. ఈ ఆర్టిస్టులు మమ్మల్ని పండ్లు అనుకుంటారు. తినేస్తారు. గింజలు అవతల పడేస్తారు. కానీ ఆ గింజలే.. చెట్లై మళ్లీ పళ్లిస్తాయి. చూద్దాం.. ఏదో ఓ రోజు తప్పకుండా కలుద్దాం`` అని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు అమ్మ రాజశేఖర్. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నితిన్... వీటిపై స్పందిస్తాడో లేదో చూడాలి.