'నా పేరు అమృత.. నేను జయలలిత, శోభన్‌బాబులకు పుట్టిన సంతానం. వేరే కారణాల వల్ల నన్ను పెంపకానికి ఇచ్చేశారు. పెంపుడు తండ్రి చనిపోయాక నాకీ విషయం తెలిసింది..' అంటూ తాజాగా ఓ మహిళ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే జయలిలిత, శోభన్‌బాబుకి మధ్య అఫైర్ ఉందంటూ చాలా కాలం క్రితం నుండీ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సినీ రంగంలో ఇలాంటి రూమర్స్‌కి అస్కారం ఎక్కువ. సో ఇది సహజమైన విషయమే. అయితే తాజాగా అమృత బయటికి రావడం, ఆమె చెబుతున్న మాటల్లో వాస్తవమెంతుందో కానీ, ప్రస్తుతం ఈ సంగతి వివాదాస్పదమవుతోంది.
అమృత మాత్రం గతంలో జయలలితను చాలా సార్లు కలిశాననీ, తల్లిలా ఆమె ఓదార్పు పొందాననీ, ఆమె తనని ఎంతో గారాబంగా అక్కున చేర్చుకునేవారనీ చెబుతోంది. అలాగే తండ్రి శోభన్‌బాబును కూడా తాను కలిశాననీ, ఆయన కూడా తన పట్ల ఎంతో ప్రేమ చూపించారనీ అమృత చెబుతోంది. అంతేకాదు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని వారు చెప్పారనీ చెబుతోంది అమృత. జయలలిత మరణించడంతో తాను బయటికి రావాల్సి వచ్చిందనీ అంటోంది. తాను వీరిద్దరికీ పుట్టిన సంతానమే అని తేలేందుకు డీఎన్‌ఏ పరీక్షకు సైతం సిద్ధమంటోంది ఈ మహిళ. అయితే ఈ విషయాలను ఖండించడానికి ప్రస్తుతం జయలలిత గానీ, శోభన్‌బాబు గానీ జీవించి లేరు.
సినీ, రాజకీయ రంగంలో ఇలాంటి రూమర్స్ సహజమే కానీ, శోభన్‌బాబుపై సినీ రంగంలో ఎటువంటి రిమార్క్స్ లేవు. సినీ రంగంలో స్వచ్ఛమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిపై ఇలాంటి రూమర్స్ రావడం బాధాకరం. అంతేకాదు తాజాగా వస్తున్న ఈ ఆరోపణలతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు దూరమయ్యాక శోభన్‌బాబు చెన్నైలో ప్రశాంత జీవితం గడిపారు. అలాగే జయలలిత సంగతి తెలిసిందే. చనిపోయే వరకూ ఆమె కుమారి జయలలితే. ఈ రూమర్స్‌లో నిజమెంతుందో ఏమో తెలీదు కానీ తమిళనాట వివాదాస్పదమవుతోంది ఈ తాజా విషయం.