అనసూయలోని ఓ హాట్ యాంకర్ మాత్రమే ఉందనుకున్నారు జనాలు. కానీ.. తనలో ఓ మంచి నటి కూడా ఉందని సుకుమార్ రుజువు చేశాడు. `రంగస్థలం` సినిమాతో. ఇందులో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రల్లో చరణ్, సమంత ఎలా గుర్తుండిపోతారో, రంగమ్మత్తగానూ అనసూయ అలానే గుర్తిండిపోతుంది. రంగస్థలం తరవాత.. అనసూయని ప్రేక్షకులు, దర్శకులు చూసే దృష్టి కోణం కూడా మారిపోయింది. తాజాగా ఇప్పుడు అలాంటి మరో మంచి పాత్ర దక్కిందట.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగమార్తండ`లో కీలకమైన పాత్ర పోషిస్తోంది అనసూయ. ఈ చిత్రంలోనూ అనసూయ పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందట. కృష్ణవంశీ సినిమా అంటే తప్పకుండా నటీనటులకు పెద్ద పరీక్ష. అప్పటి వరకూ ఆయా నటీనటుల్లో చూడని కోణాన్ని కృష్ణవంశీ తన సినిమాల ద్వారా బయటపెడుతుంటాడు. అనసూయ పాత్రని సైతం అలానే డిజైన్ చేశాడట. ఈ సినిమాలో అనసూయ రంగస్థల కళాకారిణిగా నటించబోతోందని తెలుస్తోంది. రంగస్థల కళాకారిణి జీవితాల్లోని వ్యధకి అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండబోతోందట. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది.