`మా` ఎలక్షన్ల సందర్భంగా కోట శ్రీనివాసరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి - టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా మారారు. ఇప్పుడు మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యాంకర్, నటి అనసూయ గురించి ఇటీవల ఓ టీవీ ఛానల్ లో కొన్ని కామెంట్లు చేశారు కోట. అనసూయ డ్రస్సింగ్ స్టైల్ తనకు నచ్చదని, ఆమె నటన బాగుంటుందని, అయితే జనాలు ఎగబడి చూడాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న బట్టలు వేసుకోవడం బాగోలేదని చురక అంటించారు.
దీనిపై అనసూయ కాస్త ఘాటుగా స్పందించింది. కోట పేరు నేరుగా ఎత్తలేదు కానీ, తన డ్రస్సింగ్ స్టైల్ పై ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు తన వరకూ వచ్చాయని, ఓ అనుభవజ్ఞుడైన వ్యక్తి.. తన డ్రస్సింగ్ స్టైల్ పైకామెంట్ చేయడం సరికాదని, వస్త్రాధారణ పూర్తిగా తన వ్యక్తిగతం, వృత్తిగతమని, దానిపై ఎవరికీ కామెంట్ చేసే హక్కులేదని తేల్చి చెప్పింది. సదరు సీనియర్ నటుడు తప్పతాగి సెట్ పైకి వస్తాడని, మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తాడని, అయితే అవెప్పుడూ వార్తలు కాలేదని, హీరోలు పెళ్లయి, సిక్స్ ప్యాక్‌లు చూపించినా ఫర్లేదు గానీ, తనలా ఎదగాలనుకున్న అమ్మాయిలకు మాత్రం శుద్దులు చెబుతారని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇవన్నీ కోట శ్రీనివాసరావు గురించి అనసూయ చేసిన కామెంట్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమధ్య జరిగిన `మా` ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసింది అనసూయ. కోటనేమో.. విష్ణు ప్యానల్ కి మద్దతు తెలిపాడు. దాంతో.. వీరిద్దరి మధ్య వివాదం మరింత మంట రేకెత్తిస్తోంది.