ఈరోజుల్లో మౌత్ టాక్ ని బట్టే సినిమా కలక్షన్లు. తొలి రోజే నెగిటీవ్ టాక్ వస్తే - సినిమా ఫట్టే. రెండో రోజే వసూళ్లు బాగా పడిపోతాయి. `మహా సముద్రం` విషయంలో అదే జరిగింది. తొలి రోజు `మహా సముద్రం` మంచి వసూళ్లని అందుకుంది. అయితే టాక్ నెగిటీవ్ గా రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పతనం అయ్యాయి. అయితే.. ఈ థియరీ `పెళ్లి సందడి` విషయంలో రివర్స్ అయ్యింది.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం `పెళ్లి సందడి`. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించాడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో పడగానే.. ఈసినిమాని డిజాస్టర్ గా తేల్చేశారు. కథ, కథనం ముతక వాసన కొట్టాయని రివ్యూలు వచ్చాయి. ఇలాంటి రివ్యూలు వస్తే.. ఏ సినిమాకైనా కనీస వసూళ్లు కూడా రావు. కానీ.. `పెళ్లి సందడి` అనూహ్యంగా మంచి వసూళ్లని రాబట్టింది. తొలి మూడు రోజుల్లో దాదాపు 4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రూ.7 కోట్లకు అమ్మారు. ఇప్పటికి సగానికి పైగా వచ్చేసింది. మిగిలిన సగం రాబట్టడం అంత కష్టమేం కాదు. సినిమాపై నెగిటీవ్ టాక్ వచ్చినా, దసరా సీజన్ అవ్వడం, పాటలు హిట్టు కొట్టడంతో.. వసూళ్లు ఆశించినదానికంటే బాగా వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.