'రంగమ్మత్త'గా అవతరించి, 'రంగస్థలం' సక్సెస్‌లో తనవంతు పాత్ర పోషించింది హాటెస్ట్ యాంకర్ అనసూయా భరద్వాజ్. ఆ తర్వాత అనసూయకు ఎన్నో మంచి అవకాశాలు తలుపు తట్టాయి. అయితే, 'రంగమ్మత్త' తెచ్చి పెట్టినంత క్రేజ్ మరో సినిమాతో దక్కలేదు అనసూయకి. అలా ఆ పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ అని చెప్పక తప్పదు. ఇక తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో 'కథనం' సినిమా రూపొందింది కానీ, ప్రమోషన్స్‌లో భాగంగా పవర్ ఫుల్ పంచ్ డైలాగులు పేల్చిన అనసూయ, సినిమాతో ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
ఇక ఆ సినిమా సంగతి పక్కన పెడితే, తాజాగా అనసూయ ఫెమినిస్ట్‌గా సడెన్ దర్శనమిచ్చింది. ఇంతకీ అనసూయ ఎందుకు ఫెమినిస్ట్ అవతారమెత్తిందంటే, ఓ సినిమా కోసం. అదే 'మీకు మాత్రమే చెప్తా'. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన ఈ చిత్రాన్ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌లోనే అనసూయ ఫెమినిస్ట్‌గా ప్రత్యక్షమవడాన్ని చూశాం. ముక్కుకు ముక్కెరతో డిఫరెంట్‌గా, అందంగా కనిపిస్తోంది అనసూయ.
ఆడవాళ్ల పట్ల మగాళ్లు చేసే దుర్మార్గాల్ని ఎత్తి చూపుతూ, పవర్‌ఫుల్‌గా డైలాగులు చెప్పేస్తోంది. సోషల్ సేవ పేరుతో మగ జాతిపై కక్ష కట్టి, మిడి మిడి జ్ఞానంతో మీడియా ముందుకొచ్చి మాకే అంతా తెలుసు.. అన్నట్లుగా మాటల తూటాలు పేల్చేసే ఫెమినిస్ట్ సిద్ధాంత కర్తలా క్లాసులు పీకే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించింది. సో అనసూయకి మరోసారి మంచి పాత్ర దక్కినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి, ఈ క్యారెక్టర్ అనసూయకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో.