వెండి తెర వేరు, బుల్లి తెర వేరు. బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగిన చాలామంది వెండి తెరపై ఫెయిల్ అయిపోయారు. అలాగే వెండి తెరపై రాణించినవాళ్లంతా బుల్లి తెరని ఈజీగా ఏలేస్తారన్న గ్యారెంటీ లేదు. తమన్నా విషయంలో ఇదే జరిగింది. తమన్నా హోస్ట్ గా జెమినీ టీవీలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం మొదలైంది. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ని ఈ షోకి ఒప్పించడమే ఓ పెద్ద సక్సెస్. అందుకే తమన్నా కి భారీ పారితోషికం ఇచ్చి ఈ షో చేయించారు. కానీ.. బుల్లి తెరపై ఈ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమన్నా స్థాయికి, ఆమెకిచ్చిన పారితోషికానికి తగినన్ని రేటింగులు ఈ షోకి రాలేదు. తమన్నా ఉన్నా ఉపయోగం సున్నా.. అనే నిర్ణయానికి వచ్చేశారు నిర్వాహకులు. దాంతో తమన్నాని తప్పించేశారు. ఈ స్థానంలో అనసూయని తీసుకొచ్చారు. ఓరకంగా ఇది మంచి ఎత్తుగడే.
తమన్నా వెండి తెరపై స్టార్ కావొచ్చు. కానీ ఓ టీవీ షోని నడిపించగల సామర్థ్యం ఆమెకు లేదన్నది సుస్పష్టం. పైగా అనుభవాన్ని కూడా ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలి. అనసూయకి బుల్లి తెరని ఎలా బెంబేలెత్తించాలో బాగా తెలుసు. అందుకే.. తనని రంగంలోకి దింపారు. వెండి తెరపై తమన్నా సూపర్ స్టార్. బుల్లి తెరపై అనసూయ కూడా అంతే. మరి ఈ షోని అనసూయ ఎంత వరకూ ముందుకు తీసుకెళ్తుందో? నిర్వాహకుల నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.