ప్రస్తుతం బుల్లితెర సూపర్ స్టార్ ఎవరు అంటే... టక్కున సుమ పేరు చెప్పేస్తారు. యాంకర్లలో తను రారాణి. టీవీ షోలు, సినిమా వేడుకలు ఏదైనా సరే, సుమ ఉండాల్సిందే. సుమ జీవితంలోని ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం అమూల్యమే. అలాంటి సుమ ఇప్పుడు వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీ ఎంట్రీ అని ఎందుకు అంటున్నామంటే.. సుమ నటిగానే చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తరవాత మెల్లగా బుల్లి తెర వైపు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ సుమ సినిమాల్లో తన నటనా పటిమని ప్రదర్శించడానికి రెడీ అయ్యిందని టాక్.
సుమ - రాజీవ్ కనకాల కలసి ఓ సినిమాలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సుమ మాటలు వింటుంటే అదే నిజమనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఒక వీడియో లో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు సుమ. సుమ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు స్ప్రెడ్ అవుతున్ననేపథ్యంలో.. దానికి ఆమె ఆశ్చర్య పోయినట్టు ఎక్స్ ప్రెషెన్స్ ఇస్తారు. ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి.. చేసేస్తే పోలా అంటూ వీడియోను ముగిస్తారు. మోర్ డిటైల్స్ సూన్ .... అంటూ ఆ వీడియో ముగించారు. అంటే.. సుమ రీ ఎంట్రీ ఖాయమన్నమాట. పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.