యాంకర్‌గా అలరించిన సుమ... ఇప్పుడు వెండి తెరపైనా ప్రతాపం చూపించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆమె నటించిన `జయమ్మ పంచాయితీ` ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సుమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాకుళం యాసలో ఆమె చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
సెట్లో కూడా తను కష్టపడిన విధానం మేకింగ్ వీడియోల్లో చూస్తే అర్థమవుతోంది. అయితే.. తాజాగా సుమ ఓ చిన్న వీడియోని విడుదల చేసింది. జయమ్మ పంచాయితీ సమయంలో తీసిన మేకింగ్ వీడియోల్లో చిన్న బిట్ అది. కొండ కోనల్లో, వాగు వంకల్లో.. షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ బండరాయిని ఆనుకుని నిలబడిన సుమ..చూస్తూ చూస్తుండగానే, చటుక్కున కాలు జారి కింద పడబోయింది. అంతలోనే ఎలాగోలా... తయాయించుకుంది. లేకపోతే.. పెద్ద ప్రమాదమే సంభవించేది. ఈ వీడియోని సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా అంటూ కామెంట్ జోడించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.