సునీల్ సరసన ‘తడాఖా’ సినిమాలో నటించిన హీరోయిన్ ఆండ్రియా జెర్మయా గుర్తుందా.? తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఓ షార్ట్ ఫిలింతో సందడి చేయనుంది. ఆ షార్ట్ ఫిలిం పేరు ‘లాక్‌డౌన్’. ఈ షార్ట్ ఫిలిం మొత్తాన్నీ ఐ ఫోన్‌లో చిత్రీకరించడం విశేషం. అధవ్ కన్నదాసన్ ఈ షార్ట్ ఫిలింని రూపొందించారు. ఓ సినిమాకి వుండే అన్ని హంగులూ ఈ షార్ట్ ఫిలింకి వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
తన కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన సందర్భమని ఆండ్రియా అంటోంది. ఎప్పుడూ రొటీన్‌కి భిన్నంగా సినిమాల్ని ఎంచుకునే ఆండ్రియా, షార్ట్ ఫిలిం ఎంపికలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. త్వరలోనే ఈ షార్ట్ ఫిలింని విడుదల చేయబోతున్నారు. పరిమిత వనరులతోనే దీన్ని చిత్రీకరించామని, అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇదిలా వుంటే, లాక్‌డౌన్ నేపథ్యంలో మరికొన్ని షార్ట్ ఫిలింస్ వివిధ భాషల్లో రాబోతున్నాయి. కొన్ని సినిమాలు కూడా లాక్‌డౌన్ నేపథ్యంలో తెరకెక్కనున్నాయి. ఈ మేరకు కథల్ని రూపొందించే పనిలో పడ్డారు.