పూరి జగన్నాథ్ - మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లోనే కాదు, పూరి జగన్నాథ్ కెరీర్‌లోనూ అదో స్పెషల్ ఫిలిం. ఆ మాటకొస్తే, ‘పోకిరి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అది వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. అంత పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. ‘పోకిరి’ 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులు, సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేశారు. ‘పోకిరి’ని ట్రెండింగ్‌లో వుంచారు. లక్షల కొద్దీ ట్వీట్లు పడ్డాయి ‘పోకిరి’ పైన. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ కూడా తనదైన స్టయిల్లో ట్వీటేశాడు. అయితే, హీరో మహేష్‌బాబుని ట్యాగ్ చెయ్యకపోవడం పూరిని వివాదాల్లోకి నెట్టింది.
పూరి జగన్నాథ్‌కీ, మహేష్‌బాబుకీ మధ్య విభేదాలున్నాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఆ ప్రచారానికి నిన్నటి పూరి ట్వీట్ ఆజ్యం పోసిందా.? అంటే, ఔననే అభిప్రాయం మహేష్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కానీ, ఇక్కడ పూరి, మహేష్‌నే కాదు.. ఇంకెవర్నీ ట్యాగ్ చేయలేదు. అభిమానులు మాత్రం, పూరిపై విమర్శలతో విరుచుకుపడిపోయారు. అభ్యంతరకరమైన కామెంట్ల సంగతి సరే సరి. ఆ విషయాన్ని పక్కన పెడితే పూరి - మహేష్ కలిసి మరో సినిమా (బిజినెస్‌మెన్) కూడా చేశారు. ఇద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా రావాల్సి వుంది. కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. అదే ‘జనగనమన’.