వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకూ 5 సినిమాలు తీస్తే.. ఐదూ హిట్టే. పైగా ఒకదాన్ని మించి మరో విజయం. అన్నీ కుదిరితే ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉండాల్సింది. కానీ.. కరోనా వల్ల ప్లానింగులన్నీ తారుమారు అయ్యాయి. ఎఫ్ 3 స్క్రిప్టుని అనిల్ రావిపూడి తాత్కాలికంగా పక్కన పెట్టాల్సివచ్చింది. ఆ స్థానంలో మరో సినిమాని మొదలెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు అనిల్.
బాలయ్య కోసం రాసుకున్న `రామారావు గారూ` సినిమాని పట్టాలెక్కిద్దాం అనుకున్నాడు. అయితే అదంత ఈజీ కాదు. బోయపాటి శ్రీను సినిమా పూర్తయితే గానీ, బాలయ్య కమిట్మెంట్ ఇవ్వలేడు. అందుకే ఆ ప్రాజెక్టునీ పక్కన పెట్టి, మరో యువ హీరోతో ఓ సినిమా చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడట. అనిల్ దృష్టిలో ఉన్న ఆ యంగ్ హీరో ఎవరో కాదు... అఖిల్. దిల్ రాజు బ్యానర్‌లో అఖిల్ ఓ సినిమా చేయాలి. దాన్ని ఇప్పుడు పట్టాలెక్కించేస్తే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నాడట. అఖిల్ కి సరిపడ కథ.. అనిల్ రావిపూడి దగ్గర కూడా ఉందని తెలుస్తోంది. సో.. అన్నీ కుదిరితే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరవాత అఖిల్ ప్రాజెక్టు ఇదే కావొచ్చు.