కరోనా వచ్చి... ప్రణాళికలన్నీ తారు మారు చేసేసింది. చేయాల్సిన సినిమాలు పక్కకు వెళ్లిపోయాయి. పక్కన పెట్టేసిన కథలకు బూజు దులుపే పరిస్థితి వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి విషయంలో ఇదే జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే.. ఈపాటికి `ఎఫ్ 3` షూటింగ్ తో బిజీ బిజీగా ఉండేవారాయన. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలబెట్టేసేవారు. కానీ.. కరోనా వల్ల ప్లానింగ్ తారుమారు అయ్యింది.
లాక్ డౌన్ సమయంలోనే ఎఫ్ 3 స్క్రిప్టు పూర్తి చేశారు అనిల్ రావిపూడి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా మొదలవ్వడం కష్టమే. 2021 వేసవిలో గానీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈలోగా ఖాళీగా ఉండడం అనిల్ రావిపూడికి ఇష్టం లేదు. అందుకే ఇది వరకే సిద్ధం చేసుకున్న మరో కథని ఆయన బయటకు తీశారు. `రామారావుగారు` అనే పేరుతో బాలయ్య కోసం ఓ కథ రెడీ చేశాడు అనిల్.
పటాస్ తరవాత ఈ కథ రాసుకున్నాడాయన. అయితే... బాలయ్య కాల్షీట్లు దొరకలేదు. ఇప్పుడు ఈ కథని బాలయ్యకి మరోసారి చెప్పి, ఒప్పించే పనిలో పడ్డాడు రావిపూడి. ఇప్పటికే బోయపాటి సినిమాని మొదలెట్టేశాడు బాలయ్య. అది పూర్తవ్వడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు. ఓ వైపు బోయపాటి సినిమా చేస్తూ.. అనిల్ రావిపూడికి కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉంటే... `రామారావుగారు` మొదలైపోయే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.