వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు అనిల్ రావిపూడి. మహేష్ తో చేసిన `సరిలేరు నీకెవ్వరు` ఇండ్రస్ట్రీ రికార్డుల్ని సృష్టించింది. అయితే ఆ తరవాత మాత్రం ఏ సినిమానీ మొదలెట్టలేదు. ఎఫ్ 3ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నా లాక్ డౌన్ వల్ల కుదర్లేదు. కాకపోతే ఎఫ్ 3 స్క్రిప్టుని ఎప్పుడో పూర్తి చేసి పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు దాన్ని పట్టాలెక్కించే సమయం ఆసన్నమైంది.
2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని మొదలెట్టాలని వెంకీ భావిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి 2021 వేసవి బరిలో నిలపాలని చూస్తున్నారు. త్వరలోనే `నార్పప` షూటింగ్ మొదలవ్వనుంది. ఆ సినిమాని డిసెంబరులోగా ఫినిష్ అయితే 2021 సంక్రాంతికి ఈ సినిమా మొదల్వవడానికి రూట్ క్లియర్ అయినట్టే. అయితే... వరుణ్‌తేజ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో చెప్పడం కష్టం. ఎందుకంటే తన చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పూర్తయితే గానీ ఎఫ్ 3లో అడుగుపెట్టలేడు వరుణ్. అందుకే ముందుగా వెంకటేష్ పార్ట్ పూర్తి చేసి ఆ తరవాత కాంబో సన్నివేశాలపై దృష్టి పెట్టాలని అనిల్ రావిపూడి స్కెచ్ రెడీ చేస్తున్నాడు. ఇద్దరు హీరోలతో ఓ సినిమాని కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలనుకోవడం సాహసమే. మరి.. దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తాడో చూడాలి.