ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నారు. ఈ యేడాది ఈ సినిమాని పట్టాలెక్కించాలన్నది దిల్ రాజు ఆలోచన. అయితే... ఈ సినిమా అంత తేలిగ్గా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎఫ్ 3 లైన్ ఇప్పటికే దిల్ రాజు ఓకే చేసేశాడు. అది స్క్రిప్టు రూపంలోకి మారాలి. ఎఫ్ 2లో ఉన్న మ్యాజిక్ ఎఫ్ 3లో కనిపించాలి. అది లేకపోతే కథ ఓకే చేసినా, దిల్ రాజు ఈ సినిమాని మొదలెట్టడు. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో ఈ సినిమాకి అవసరం. రవితేజ పేరు పరిశీలనలో ఉన్నా, తనని తీసుకోవడం అనుమానమే. ఎందుకంటే రవితేజ వరుస ఫ్లాపులలో ఉన్నాడు.
పైగా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న హీరోకి అంతంత పారితోషికం ఇవ్వడానికి దిల్ రాజుకి మనసొప్పడం లేదు. ఇప్పుడు వెంకటేష్ కూడా పారితోషికాన్ని పెంచేసినట్టు సమాచారం. ఎఫ్ 2కి తీసుకున్నదానికంటే డబుల్ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. నిజానికి వెంకీ పారితోషికాల విషయం పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ మధ్య ఎఫ్ 2, వెంకీ మామ విజయాలతో వెంకటేష్ రేసులోకి వచ్చాడు. అందుకే.. పారితోషికం పెంచేశాడు. పైగా ఎఫ్ 3 నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్‌ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాడు.
మరోవైపు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఈ సినిమాలో భాగం తీసుకోవాలనుకుంటోంది. ఈ లెక్కలన్నీ తేలాల్సివుంది. సో... ఎఫ్ 3 కథ రెడీ అయినా, పట్టాలెక్కాలంటే చాలా అవరోధాల్ని దాటుకుంటూ వెళ్లాలి. మరి ఈ సినిమా ఎప్పటికి తేలుతుందో..?