పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి వరస హిట్లతో టాలెంటెడ్, క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదలైన 'ఎఫ్ 2' సినిమాతో అనిల్ రావిపూడి ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. విజయాల వెంట పరుగులు తీసే సినీ పరిశ్రమ, హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేర్చేసింది.
దీంతో.. ఫుల్ జోష్ మీదున్న అనిల్ రావిపూడి సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమాకి కమిట్ అయ్యాడు. 'మహర్షి' తర్వాత మహేష్‌బాబు చేయబోయే చిత్రం ఇదే. కాగా.. ఈ సినిమాకి అనిల్ రావిపూడి భారీ పారితోషకం అందుకోబోతున్నాడట. మహేష్ సినిమా అంటే వంద కోట్ల బిజినెస్ ఖచ్చితంగా జరిగిపోతుంది. ఆ నమ్మకంతోనే, దర్శకుడికి అక్షరాలా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీ అయ్యారని టాలీవుడ్ వర్గాల టాక్.
దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మిలిటరీ అధికారిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం, అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మహర్షి సినిమా విడుదల అనంతరం వీలైనంత తొందరగా ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు.