'రన్ రాజా రన్' సినిమాతో పరుగు స్టార్ట్ చేసిన శర్వానంద్ వరుసగా సంక్రాంతి, దసరా పండగలకు తన సినిమాలు రిలీజ్ చేసి, వరుస హిట్లు అందుకున్నాడు. దాంతో ఫెస్టివల్ హీరో అనే ట్యాగ్‌లైన్‌ని కూడా అంది పుచ్చుకున్నాడు. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన 'పడి పడి లేచె..' శర్వానంద్ పరుగుకు బ్రేకులు వేసింది. పడి పడి లేచాడు కానీ, నిలబడలేకపోయాడు. ఆ సినిమా తర్వాత శర్వా రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
వీటిలో సుధీర్ వర్మ డైరెక్షన్‌లో శర్వానంద్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శర్వాకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తాజాగా సమంతతో శర్వానంద్ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన '96'కి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అక్కడక్కడా కొన్ని మార్పులు చేర్పులూ చేసి, స్క్రిప్టు సిద్ధం చేసి ఉంచారు.
త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా కంప్లీట్ చేసి దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో దిల్‌రాజు, శర్వా కాంబినేషన్‌లో వచ్చిన 'శతమానం భవతి' సినిమా సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అదే మ్యాజిక్‌ని ఇప్పుడు '96' రీమేక్‌తో రిపీట్ చేయాలనుకుంటున్నారట దిల్‌రాజు. ఈ సినిమాకి 'జాను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.