బాలీవుడ్ నుంచి ఓ వైపు, శాండల్ వుడ్ నుంచి ఇంకో వైపు తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ సెగ తగులుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, నమ్రతా శిరోద్కర్ పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె నిర్మాణంలో ప్రస్తుతం బిజీగా వుందనీ, గతంలోనూ ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయనీ అంటున్నారు. ఇక, ఓ ప్రముఖ నటుడి కుమార్తె విషయంలోనూ ఇవే తరహా ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
బాలీవుడ్ మీడియా ఆయా పేర్లను చూచాయిగా ప్రచారంలోకి తేవడం, కొందరి పేర్లను బాహాటంగానే ప్రకటించడంతో.. టాలీవుడ్ నుంచి ఎవరు ఈ కేసులో ‘గ్రిల్ అవుతారు.?’ అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. కన్నడ హీరోయిన్ సంజనకి, తెలుగులోనూ చాలామంది స్నేహితులున్నారు. ఆమెని ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సంజన కూడా ఓ ప్రముఖ తెలుగు నటి పేరు చెప్పిందనే ప్రచారం కన్నడ సినీ వర్గాల్లో జరుగుతోంది.
మొత్తంగా చూస్తే, ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని అంత తేలిగ్గా వదిలేలా కన్పించడంలేదు. మొత్తంగా ఓ నలుగురైదురు హీరోయిన్ల పేర్లు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుంచి ప్రచారంలోకి రావడం గమనార్హం. ఇందులో ప్రస్తుతం హీరోయిన్‌గా ఫుల్ జోష్‌లో వున్న ఓ అందాల భామ పేరు కూడా వుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ తరహా ప్రచారాలతో సెలబ్రిటీల ఇమేజ్‌ని దెబ్బ తీసే కుట్ర తప్ప, వీటిల్లో వాస్తవాలుండవనే వాదన కూడా సినీ పరిశ్రమ నుంచి వినిపిస్తోంది.