అందం, అభినయం ఉన్నా - అదృష్టం కలసిరాని కథానాయికల్లో అను ఇమ్మానియేల్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఇప్పటి వరకూ చాలా సినిమాలే చేసింది. కానీ సరైన బ్రేక్ రాలేదు. తాజాగా విడుదలైన `ఊర్వశివో రాక్షసివో` కాస్త ఉపశమనం కలిగించింది. ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. ఈ సినిమాతో తనకో హిట్టు పడినట్టే.
అయితే కెరీర్ పరంగా తానెప్పుడూ కంగారు పడలేదని, తనకు నచ్చిన సినిమాలే చేసుకొంటూ పోయానని, హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ నటిగా మంచి మార్కులు తెచ్చుకొన్నానని అంటోంది అను ఇమ్మానియేల్. అయితే తాను ఆశలు పెట్టుకొన్న రెండు సినిమాలు మాత్రం దారుణంగా మోసం చేశాయంటోంది. అవి రెండు సినిమాలూ మెగా హీరోలవి కావడం విశేషం. ''అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ఈ రెండూ నా కెరీర్‌లో చాలా పెద్ద అవకాశాలు. వీటిపై చాలా ఆశలు పెట్టుకొన్నా. కానీ రెండు సినిమాలూ నన్ను మోసం చేశాయి. సరిగా ఆడలేదు. ఈ విషయంలో ఇప్పటికీ బాధ పడుతుంటా. అయితే... నన్ను నమ్మి ఈ రెండు చిత్రాల్లోనూ నాకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణ పడి ఉంటా. ఆ రెండు సినిమాలూ ఆడి ఉంటే.. నా ప్రయాణం మరోలా ఉండేది'' అని చెప్పుకొచ్చింది అను. `ఊర్వశివో - రాక్షసివో` కూడా మెగా హీరో సినిమా. కాబట్టి... ఈ మెగా హీరోలు ఇవ్వలేని హిట్టు... అల్లు శిరీష్ ఇచ్చాడు. ఆ రకంగా.. లెక్క సరిపోయినట్టే.