స్రవంతి మూవీస్... ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే. క్లీన్ యూ చిత్రాలకు, కుటుంబ కథలకు పెట్టింది పేరు. త్రివిక్రమ్ దశ, దిశ తిరిగింది స్రవంతి మూవీస్ లోనే. దర్శకుడిగా త్రివిక్రమ్‌కి తొలి అవకాశం ఇచ్చింది కూడా స్రవంతినే. `నువ్వే నువ్వే`తో పెన్ను వదిలి మెగాఫోన్ పట్టాడు త్రివిక్రమ్. ఆ సినిమాని నిర్మించింది స్రవంతి మూవీస్ సంస్థే. `నువ్వే నువ్వే` తరవాత త్రివిక్రమ్ ప్రస్థానం ఏమిటో మనకు తెలిసిందే. స్రవంతి కూడా కొన్ని హిట్లు కొట్టింది. అయితే.. ఈమధ్య స్రవంతి ట్రాక్ రికార్డు బాలేదు. దాదాపుగా అన్ని సినిమాలూ నష్టాలనే మిగిల్చాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసి, మళ్లీ ట్రాకులోకి రావాలన్నది స్రవంతి ప్లాన్.
అయితే అదంత ఈజీ కాదు. ఎందుకంటే.. త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా... హారిక హాసినిలోనే. ఆ సంస్థను కాదని త్రివిక్రమ్ మరొకరితో జట్టు కట్టడం లేదు. హారిక హాసిని అంటే.. త్రివిక్రమ్, త్రివిక్రమ్ అంటే హారిక హాసిని అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ దశలో.. స్రవంతికి ఛాన్స్ ఇవ్వడం అనుమానమే. అయితే ఈమధ్య `నువ్వే నువ్వే`కి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ వేడుకలో.. స్రవంతికి తానెంత రుణపడి ఉన్నాడో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. స్రవంతి రవికిషోర్ అడిగితే.. త్రివిక్రమ్ కాదనడం దాదాపు అసాధ్యమే. అందుకే.. ఈ కాంబోకి ఇంకా అవకాశాలున్నాయి. హారిక, హాసినితో స్రవంతి భాగస్వామిగా మారి.. ఓ సినిమా చేసినా ఆశ్చర్యం లేదు. అలా చేస్తే గనుక.. తనకు తొలి అవకాశం ఇచ్చిన స్రవంతి రుణం తీర్చుకొన్నట్టు అవుతుంది.
అయితే ఈలోగా.. `నువ్వే నువ్వే`ని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది స్రవంతి. త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా నువ్వే నువ్వేని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య రీ రిలీజ్ సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. కొత్త సినిమా స్థాయిలోనే ఓపెనింగ్స్ వస్తున్నాయి. `నువ్వే నువ్వే` కూడా కాసిన్ని వసూళ్లు సంపాదించుకొంటే.. స్రవంతికి కాస్త ఊరట లభించొచ్చు.