భీమవరం అనగానే పందాల రాయుళ్ల హడావుడి కనిపిస్తుంది. సంక్రాంతి టైమ్ లో అయితే మరీనూ.. కోడి పందాలు, పేకాట, మందు - చిందూ - ఆ జోషే వేరు. ఇదంతా `అనుభవించు రాజా`లో కనిపించబోతోంది. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్వీసీ (ఎల్.ఎల్.పీ) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. కొద్దిసేపటి క్రితం రామ్ చరణ్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది.
భీమవరం కోడి పందాల సెటప్, అనుభవించు రాజా పాటతో టీజర్ మొదలైంది. ``అయినా బంగారం గాడు ఊర్లోనీ, ఆడి పుంజు బరిలోనీ ఉండగా, ఇంకో పుంజు గెలవడం కష్టమెహె..`` అనే డైలాగ్ తో పూల రంగడు గెటప్ లో... రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టే, క్యారెక్టరైజేషన్ కుదిరింది. గోదారి జిల్లా వాళ్ల ఎటకారం, అక్కడి నేటివిటీ.. టీజర్ లో కనిపించింది. ``తిప్పే కొద్దీ తిరగడానికి అదేమైనా ఫ్యాను స్పీడేంట్రా... ఉన్న నాలుగు ఎంట్రుకలూ ఊడిపోతాయ్`` ``నీ బాధ నాకర్థమైంది.. నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయింత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా`` లాంటి డైలాగులు పడ్డాయి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హుషారుగా సాగింది. కెమెరా పనితనంతో పల్లెటూరి అందాలు, సంక్రాంతి జోరు కనిపించింది. మొత్తానికి రాజ్ తరుణ్ కి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతోందనిపిస్తోంది.