నటీనటులు: డా. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేక సుధాకర్ తదితరులు
దర్శకుడు : వెంకటేష్ పెదిరెడ్ల
నిర్మాత: డా. జగన్ మోహన్ డి.వై
సంగీతం: ఎస్ శివ దినవహి
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని
ఎడిటర్: రామ్ తుము
రేటింగ్ : 2.5/5
సోలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఎప్పుడో ఆగిపోయాయి. అయితే చాలా కాలం తర్వాత ఆయనే ప్రధాన పాత్రలో వచ్చింది 'అనుకోని ప్రయాణం. నిజానికి ఈ సినిమాపై పెద్ద బజ్ లేదు. ''నా 45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో 'అనుకోని ప్రయాణం' ఒకటి''అంటూ సినిమాపై కాస్త హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు 'అనుకోని ప్రయాణం' లో అంత గొప్పగా ఏముంది? ఈ ప్రయణం ఎలా సాగింది ?
కథ:
రాజేంద్రప్రసాద్ (ఇందులో రాజేంద్రప్రసాద్ పాత్రకు పేరు లేదు) రాజు (నరసింహరాజు) మంచిస్నేహితులు. భువనేశ్వర్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తుంటారు. నరసింహరాజు కుటుంబం ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తుంది.
రాజేంద్ర ప్రసాద్ ఒంటరి. ఇద్దరు స్నేహితులు హాయిగా పని చేసుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో అకస్మత్తుగా నరసింహరాజు గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయానికి కోవిడ్ -19 లాక్‌డౌన్ పడుతుంది. స్నేహితుడి చివరి కోరిక మేరకు రాజేంద్ర ప్రసాద్ స్నేహితుడి మృతదేహాన్ని రాజమండ్రి తరలించాలి. మరి లాక్ డౌన్ సమయంలో ఈ పని ఎలా చేశాడు? ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కరోనా సమయంలో గుండెని మెలిపెట్టే చాలా సంఘటనలు వెలుగు చూశాయి. మనిషి మనిషి పలకరించడానికే భయపడ్డారు. చావులు అయితే మరీ దారుణం. అలాంటి ఓ చావుకి సంబధించిన కథ ఇది. భువనేశ్వర్‌లో చనిపోయిన వ్యక్తి శవాన్ని రాజమండ్రి తీసుకురావాలి. లాక్ డౌన్ సమయంలో ఇది ఇంపాజిబుల్. దీనే కథగా మార్చారు. అయితే ఈ కథని ట్రీట్ చేసిన విధానం మాత్రం అవుట్ డేటడ్ గా అనిపిస్తుంది.
గుండెలు బాధకునే ఎమోషన్స్ సీన్స్ కి కాలం చెల్లిపోయిన రోజులివి. చాలా హెవీ ఎమోషన్ వున్న కంటెంట్ ని కూడా ఎంటర్ టైన్ మెంట్ అనే కోటింగ్ వేసి తీయాల్సిందే. కరోనా పేరుని తల్చుకోవడానికి చిరాకు పడిపోయే స్థితిలో జనాలు వున్నారు. అలాంటింది ఆ సమయంలో జరిగిన ఒక దారుణమైన సంఘటని సినిమాగా తీసి చూడండని చెబితే అంత హెవీ పెథాస్ డ్రామా చూసే మూడ్ ఇప్పుడు ఎవరికీ లేదు.
కొత్త దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మెలోడ్రామాటిక్ కాస్త లైట్ చేయడానికి కామెడీ ట్రాక్ ని వాడాడు. అయితే ఆ కామెడీ కథపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మేము కామెడీ చేస్తామని కొన్ని పాత్రలు రావడం నాలుగు డైలాగులు చెప్పి స్టేజ్ దిగిపోయిన వ్యవహారంలా మారుతుంది తప్పితే అందులో సహజత్వం లేదు. నిజానికి ఈ కథకు కామెడీ అతకదు. లాక్ డౌన్ సమయంలో ప్రజల మూడ్ లో కామెడీ లేదు. దీంతో అదంతా ఫోర్స్ద్ కామెడీ అనిపించేలా వుంటుంది. అయితే కొత్త దర్శకుడు ఇలాంటి ఒక హెవీ డ్రామా వున్న పాయింట్ ఎత్తుకువడం, చివరి చూపు, సొంత వూరు, ఎమోషన్స్ ఇవన్నీ బావున్నా.. వాటిని స్క్రీన్ పైకి తెచ్చిన తీరు మాత్రం ఆకట్టుకోదు.
నటీనటులు:
రాజేంద్రప్రసాద్ నటకిరీటి. ఆయన నటన ఇందులో పెద్ద ఉపసమనం. తన అనుభవంతో చాలా ఆశువుగా ఈ పాత్రని చేసుకుంటూ వెళ్లారు. చాలా రోజుల తర్వాత ప్రేమ ఇందులో కనిపించింది.
అయితే ఆ పాత్ర కూడా లిమిటెడ్ గానే వుంది, నరసింహరాజు తన అనుభవం చూపించారు. తులసి, రవిబాబు, ధనరాజ్, శుభలేక సుధాకర్, ప్రభాస్ శ్రీను పరిధిమేర చేశారు.
సాంకేతిక వర్గం:
ఉత్తర ఆంధ్రాని సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ నరగాని అందంగా చూపించారు. శివ దినవహి సంగీతం ఓకే.
శంకర్ మహదేవన్ పాడిన పాట బావుంది. ఎడిటర్ ఇంకా పదును చేయాల్సింది. నిర్మాణ విలువలు సోసోగానే వున్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజేంద్ర ప్రసాద్
కథా నేపధ్యం
మైనస్ పాయింట్స్
హెవీ ఎమోషనల్ డ్రామా
అవుట్ డేటడ్ ట్రీట్ మెంట్
ఫైనల్ వర్దిక్ట్ : భారమైన ప్రయాణం!