''తెరపై అందంగా కన్పించాలనుకోవడం తప్పు కాదు. అలాగని, గ్లామర్ పేరుతో ఎక్స్‌పోజింగ్ చేసెయ్యాలనే ఆలోచనైతే నాకు లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నా వరకూ నేనెప్పుడూ అంగాంగ ప్రదర్శన విషయమై హద్దులు దాటాలనుకోవడంలేదు. అలాగని నేనెవర్నీ ఈ విషయంలో విమర్శించలేను..'' అంటోంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. 'గ్లామర్ షో ఎవరైనా చేయొచ్చు. నా ఫిజిక్ అందుకు సెట్ కాదని ఎవరన్నా అంటే నేనొప్పుకోను. అలాగని, ఎవరికో పోటీగా నేను వెండితెరపై అందాల ప్రదర్శన చేయలేను..' అని అనుపమ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చేసింది.
కేవలం అందాల ప్రదర్శనతోనే అవకాశాలు వస్తాయని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదన్న అనుపమ, ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండానే కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారనే విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోన్న అనుపమ, కన్నడలో ఒకటి, తమిళంలో రెండు సినిమాలతో బిజీగా వుంది. లాక్‌డౌన్ సమయంలో దర్శకత్వం సహా సినిమాకి సంబంధించిన విభాగాలపై మరింత అవగాహన పెంచుకున్నానంటోన్న అనుపమ పరమేశ్వరన్, ఖచ్చితంగా భవిష్యత్తులో ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానంటోంది. ఓటీటీ అనేది కొత్త కథలు చెప్పేందుకు చాలా మంచి వేదిక అని ఓ ప్రశ్నకు బదులిచ్చింది ఈ మలయాళ కుట్టి.