సినిమా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు తెరచుకుంటాయి.? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడంలేదు. డిసెంబర్ 1 తర్వాత సినిమా థియేటర్లు తెరచుకునే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమా డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరచుకుంటే సరిపోదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ.. మరీ ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోనూ సినిమా థియేటర్లు తెరచుకోవాలి.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్లు తెరచుకున్నా, అక్కడ సినిమాలకు ప్రేక్షకాదరణ చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇక, ఓవర్సీస్ మార్కెట్ ఎప్పటినుంచో సినీ పరిశ్రమకు అత్యంత కీలకంగా మారింది. అమెరికా లాంటి దేశాల్లో కరోనా ఉధృతి చాలా ఎక్కువగా వున్న దరిమిలా, ఓవర్సీస్ మార్కెట్ లేకుండా తెలుగు సినిమాల రిలీజ్‌లు అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిస్తే, అది సినిమాలకి నష్టమే తప్ప ఏ రకంగానూ లాభం చేకూర్చదు. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా, కరోనా టెన్షన్లు తగ్గి, సినిమా థియేటర్లు పూర్తి ఆక్యుపెన్సీతో తెరచుకోవాలన్నది చాలామంది సినీ ప్రముఖుల వాదన. ఈలోగా ఓటీటీనే దిక్కు.. అని సినీ అభిమానులూ అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.