'అఆ' సినిమాలో కొంచెం నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో కన్పించి మెప్పించిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నెమ్మది నెమ్మదిగా కెరీర్లో జోరు పెంచేస్తోంది. మంచి మంచి అవకాశాల్ని ఎంచుకుంటూ, హిట్స్ మీద హిట్స్ అందుకుంటోన్న బ్యూటీ ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది. తాజాగా అనుపమ, యంగ్ హీరో రామ్ నటిస్తోన్న సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇంతకు ముందు రామ్ సరసన అనుపమ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో నటించిన సంగతి తెల్సిందే. రామ్‌తో మరోసారి రిపీట్ అవుతుండడం పట్ల అనుపమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అనుపమ ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా, నేచురల్ స్టార్ నాని సరసన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలోనూ అనుపమ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఆఫర్స్ మీద ఆఫర్స్ కొల్లగొడ్తున్న ఈ బ్యూటీ, ఇంతవరకు గ్లామర్ షో చెయ్యలేదు.
ఎక్స్పోజింగ్ చేస్తేనే అవకాశాలొస్తాయని భావించే చాలామంది ముద్దుగుమ్మలతో పోల్చితే అనుపమ పరమేశ్వరన్ స్టైల్ చాలా డిఫరెంట్. మోడ్రన్‌గా కన్పించడం వరకూ ఇబ్బంది ఏమీ లేదని చెప్పే అనుపమ, ఎక్స్‌పోజింగ్‌కి మాత్రం సింపుల్‌గా 'నో' చెప్పేస్తోంది. అయినా అవకాశాలు ఆమెకు వెల్లువలా వచ్చి పడుతున్నాయంటే అనుపమని గోల్డెన్ బ్యూటీ అనాల్సిందే. 'శతమానం భవతి' సినిమాతో అనుపమకి హీరోయిన్గా స్టార్ డమ్ దక్కిన సంగతి తెలిసిందే కదా.