సంక్రాంతికి 'ఎన్టీఆర్' సినిమా వస్తుందని తాజాగా ప్రకటించాడు బాలయ్య. బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్యకు సెంటిమెంట్ ఫెస్టివల్ అయిన సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ అని ముందుగానే ప్రకటించేశారు. అందులో భాగంగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.
మరో పక్క రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై సెస్పెన్స్ వీడలేదు. ఫిబ్రవరిలోనే ఈ సినిమాని పట్టాలెక్కిస్తానన్న వర్మ, ఆ విషయంపై ఇంతవరకూ నోరు విప్పలేదు. ప్రస్తుతం నాగ్‌తో తెరకెక్కిస్తున్న 'ఆఫీసర్' సినిమాతో బిజీగా ఉన్నాడు వర్మ. దాంతో ఇప్పుడప్పుడే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో సంక్రాంతి తర్వాతే ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయి. అయితే బిఫోర్ 2019 ఎలక్షన్స్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆఫీసర్' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని అతి త్వరలోనే పూర్తి చేసి, వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై దృష్టి పెట్టనున్నాడనీ తెలుస్తోంది. ఆల్రెడీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' స్క్రిప్టుపై వర్మ ఓ ఐడియాతో ఉన్నాడట. నటీనటుల ఎంపికలో కూడా ఇప్పటికే కొంతమందిని సంప్రదించి ఉంచాడట కూడా. సో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌పై మరో బయోపిక్ అయిన 'లక్ష్మీస్ వీరగ్రంధం' అసలెంతవరకూ వచ్చిందనే సంగతి ఇంతవరకూ అప్డేట్ లేదు. ఏది ఏమైనా ఈ మూడు సినిమాలు తప్పని సరిగా 2019 ఎలక్షన్స్ టైంకి ప్రేక్షకుల ముందుకు వచ్చి తీరాల్సిందే!