హీరోలు అప్పుడప్పుడూ మైకు పట్టుకుని పాటలు పాడేస్తుంటారు. సంగీత దర్శకులు కొంతమంది హీరోల్ని గాయకుల్ని చేయడమే పనిగా పెట్టుకుంటారు. హీరోలు ఎలా పాడినా చల్తా. పైగా బోలెడంత పబ్లిసిటీ దొరికేస్తుంది. అయితే హీరోయిన్లలోనూ కొంతమంది సింగర్లున్నారు. వాళ్లని గుర్తించడం కూడా సంగీత దర్శకుల పనే. శ్రుతిహాసన్, మమతా మోహన్ దాస్, రాశీఖన్నా.. వీళ్లంతా పాటలు పాడిన వాళ్లే.
తాజాగా.. అనుపమ పరమేశ్వరన్ లోని గాయని బయటకు వచ్చింది. ఈమధ్య ఇన్స్టా లోకి వచ్చి ఓ పాట పాడింది. అందులోనూ తన మాతృ భాష మలయాళంలో. అనుపమ గాన మధురిమ చూసి నెటిజన్లంతా.. `వారెవా` అంటూ మెచ్చుకున్నారు కూడా. చూస్తుంటే అనుపమని త్వరలోనే గాయనిగానూ చూడొచ్చనిపిస్తోంది. మరి దేవిశ్రీలాంటి వాళ్లో, తమన్ లాంటి వాళ్లో... పూనుకోవాలిక.