ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం అరుదుగా జరిగే విషయం. సంక్రాంతి సీజన్‌లోనే ఇలాంటి పోటీ చూసే వీలు దక్కుతుంది. ఈ వేసవిలోనూ.. ఒకే రోజు రెండు సినిమాలు ఢీ కొనబోతున్నాయి. అవే.. `అఖండ`, `ఖిలాడీ`.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా `అఖండ`. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రవితేజ కూడా డ్యూయెల్ రోల్ చేస్తున్న సినిమా `ఖిలాడీ`. ఈ రెండూ మే 28న రాబోతున్నాయి. బోయపాటి - బాలయ్య కాంబో అంటే ఆ క్రేజ్ వేరు. సింహా, లెజెండ్ తరవాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. కచ్చితంగా ఆ రెండు సినిమాల్నీ మించే ఉంటుందన్నది బాలయ్య అభిమానుల భరోసా. టీజర్ కూడా అందరికీ నచ్చేసింది.
ఖిలాడీపైనా అంచనాలు ఉన్నాయి. క్రాక్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ చేసిన సినిమా ఇది. రాక్షసుడుతో హిట్ కొట్టిన, రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. టీజర్ కిర్రాక్ పుట్టించింది. కచ్చితంగా మరో మంచి సినిమా అవుతుందన్న భరోసా ఇచ్చింది. రెండు సినిమాలూ ఒకే రోజున రావడం, రెండు సినిమాల్లోనూ హీరోలు డ్యూయెల్ రోల్ చేయడం, ఈ రెండింటిపై మంచి అంచనాలు ఉండడంతో మే 28న బిగ్ ఫైట్ కి తెర లేచేలా చేసింది. మరి ఈ ఇద్దరిలో గెలుపెవరిదో?