అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ సినిమా చాలా బాలారిష్టాల్ని ఎదుర్కొంది. సినిమా షూటింగ్‌లో జాప్యం జరిగింది. తీరా సినిమా పూర్తయి, విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ వచ్చి పడింది. దియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఇప్పట్లో కన్పించడంలేదు. లాక్‌డౌన్ ఎత్తివేశాక పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. ఈలోగా, ‘నిశ్శబ్దం’ సినిమాని ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తెరపైకొచ్చింది.
అయితే, ఇందుకు అనుష్క సహకరించడంలేదంటూ ఓ ఫేక్ ప్రచారం షురూ అయ్యింది. నిజానికి, అనుష్క అంటేనే ‘ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ’ నటి. రెమ్యునరేషన్ సహా ఏ బేషజాలూ ఆమెకు వుండవు. అందుకే భారీ సినిమాలు ఆమెతో తీస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అనుష్క పట్ల చాలా గౌరవం వుంది సినీ పరిశ్రమలో. ఇక, విన్పిస్తోన్న గాసిప్స్‌పై ‘నిశ్శబ్దం’ చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఆయా గాసిప్స్‌లో నిజం అస్సలేమాత్రం లేదనీ, మేజర్ డెవలప్‌మెంట్ ఏదన్నా వుంటే అధికారికంగానే ప్రకటిస్తామని పీపుల్స్ మీడియా సంస్థ తేల్చి చెప్పింది.
మరోపక్క, అనుష్క కూడా తన చుట్టూ విన్పిస్తున్న రూమర్స్ పట్ల ఒకింత నొచ్చుకుంటోందట. తన కెరీర్‌లో ఇంతవరకూ ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎప్పుడూ చూడలేదని తన సన్నిహితుల వద్ద వాపోతోందట. కరోనా నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన దరిమిలా, అనుష్క నుంచి ఓ సెల్ఫీ వీడియో లాంటిది ప్లాన్ చేస్తున్నారట తాజా వివాదాలపై క్లారిటీ ఇచ్చేందుకోసం.