స్వీటీ అనుష్క 'బాహుబలి' సినిమా తర్వాత నటించిన సినిమా 'భాగమతి'. సినిమాల కరువు కాలం, అందులోనూ పెద్ద నోట్ల రద్దుతో గడ్డు కాలం నడుస్తున్న రోజుల్లో విడుదలై ఈ సినిమా ఎడారిలో ఒయాసిస్‌లా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఆదుకుంది. అనుష్క కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జి. అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. భాగమతి పాత్రలో భూమి ఫడ్నేకర్ నటించనుంది. ఇప్పటికే మన తెలుగు చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అయ్యి మంచి విజయాలందుకుంటున్నాయి. మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'అర్జున్‌రెడ్డి'ని 'కబీర్ సింగ్' పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
నాని నటించిన 'జెర్సీ' త్వరలో అక్కడ రీమేక్ కానుంది. షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాని రీమేక్ చేయనున్నారు. తాజాగా అనుష్క 'భాగమతి' హిందీ రైట్స్ దక్కించుకోవడం నిజంగా శుభ పరిణామమే. చూడాలి మరి, హిందీ 'భాగమతి' ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో.