హ్యాపీ బర్త్ డే 'అనుష్క' శెట్టి !

మరిన్ని వార్తలు

అది 2005.. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రీయ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు. అప్పుడు కొత్త వాళ్లు వ‌చ్చినా కూడా అంత ఈజీగా కుదురుకునే రోజులు కావ‌వి. అలాంటి సమయంలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఓ మెరుపుతీగ.. ఆమె పేరు అనుష్క శెట్టి.. నాగార్జున అక్కినేని హీరోగా నటించిన సూప‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అనుష్క. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూగా నామినేట్ అయ్యారు అనుష్క. ఆ వెంటనే అక్కినేని మేనల్లుడు మ‌హానంది సినిమాలో సుమంత్‌తో న‌టించారు. ఇక 2006లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన విక్ర‌మార్కుడుతో అనుష్క జాతకం మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం వెంటవెంటనే జ‌రిగిపోయాయి.

 

విక్రమార్కుడు సినిమా తర్వాత అనుష్కకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత 2009లో అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధ‌తితో జేజమ్మ నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయారు. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, సినీ మా అవార్డ్, సంతోషం అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వేదం సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసారు ఈమె. సింగం, మిర్చి, సింగం 2, బాహుబలి లాంటి ఎన్నో సినిమాలతో తిరుగులేని హీరోయిన్ అయిపోయారు అనుష్క.14 ఏళ్ల కెరీర్‌లో ఒక్క‌సారి కూడా పెద్ద‌గా అవ‌కాశం కోసం ఇబ్బందిప‌డిన సంద‌ర్భాలు అనుష్క‌కు రాలేదు. అంతగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈ దశాబ్ధ కాలంలో దక్షిణాది ఇండస్ట్రీలో మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు.

 

వ‌ర‌స సినిమాలు చేస్తూ సౌత్ ఇండ‌స్ట్రీలోనే నెం.1 హీరోయిన్ గా మారిపోయారు అనుష్క‌. తెలుగులో ఎన్నో సంచ‌ల‌న సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు జేజ‌మ్మ‌. పంచాక్ష‌రి నిరాశ పరిచినా అయినా రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి లాంటి సినిమాల‌తో త‌న స్థాయి నిరూపించుకున్నారు ఈమె. రుద్రమదేవి సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌తో పాటు సైమా అవార్డును సొంతం చేసుకున్నారు అనుష్క. ఇక బాహుబలి సినిమా ఈమె కెరీర్‌లో కలుకితురాయి. దేవసేన పాత్రకు ప్రాణం పోసిన తీరు అద్భుతమే. బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ఎంత పేరొచ్చిందో.. వాళ్లతో సమానంగా తన నటనకు మార్కులు వేయించుకున్నారు అనుష్క.

 

ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాలం, కన్నడ ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క శెట్టి. ఈమె ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని.. ఇలాగే సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉండాలని ఆశిద్దాం..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS