'బాహుబలి' తర్వాత అనుష్క వరసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలనే చేస్తోంది. 'భాగమతి' తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసిన తర్వాత మరో సస్పెన్స్ థ్రిల్లర్ 'నిశ్శబ్దం' లో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే స్వీటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు పచ్చజెండా ఊపిందని సమాచారం. యువ దర్శకుడు పీ. మహేష్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'రారా కృష్ణయ్య' సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు పి. మహేష్. ఆ సినిమా తర్వాత మరో సినిమా చెయ్యలేదు.
ఆ సినిమా రిలీజ్ అయిన ఆరేళ్లకు ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఫిక్స్ కావడం గొప్ప విషయమే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారని సమాచారం. ఇక యూవీ బ్యానర్లో 'మిర్చి', 'భాగమతి' తర్వాత నటిస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుందని అంటున్నారు. వరసగా రెండు థ్రిల్లర్ ఫిలిమ్స్ లో నటించిన అనుష్కకు ఈ సినిమా ఓ డిఫరెంట్ సినిమా కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం.