అనుష్క 'నిశ్శబ్దం' ఎప్పుడో పూర్తయ్యింది. థియేటర్లు తెరవకపోవడం వల్ల, విడుదలకు నోచుకోలేదు. అయితే ఓటీటీ ఆఫర్లు మాత్రం చాలా వచ్చాయి. థియేటర్ల కోసం ఎదురు చూసిన నిర్మాతలు ఓటీటీ ఆఫర్లని పక్కన పెట్టారు. అయితే ఎంతకీ థియేటర్లు తెరచుకునే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేయడమే శరణ్యం అయ్యింది.
అమేజాన్ ప్రైమ్ తో నిర్మాతలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆగస్టులో ఈ సినిమా ఆమేజాన్ లోకి వస్తుందని ఓ ప్రచారం సాగుతోంది. ఈ సినిమాని 35 కోట్లకు అమేజాన్ సొంతం చేసుకుందని టాక్. దాదాపు 25 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. వడ్డీలు కలుపుకుంటే.. 30 కోట్ల ఖర్చు తేలుతుంది. అంటే 5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఇది మంచి బేరమే. పైగా అనుష్క సినిమా అంటే తమిళ, కన్నడ భాషల్లోనూ క్రేజ్ ఉంటుంది. మాధవన్ ఉన్నాడు కాబట్టి.. హిందీలోనూ చూస్తారు. అందుకే 35 కోట్ల భారీ రేటు ఇచ్చి ఈసినిమా కొన్నారు. త్వరలోనే `నిశ్శబ్దం` ప్రమోషన్లు మొదలవుతాయని టాక్. ఓటీటీలో విడుదల అవుతున్నా - థియేటరికల్ రిలీజ్ ప్రమోషన్లు ఎంత భారీగా చేస్తారో, అంతే భారీగా ఓటీటీ ప్రమోషన్లూ చేయాలని చిత్రబృందం భావిస్తోందట.