చిరంజీవి 152వ చిత్రం నుంచి త్రిష అనూహ్యంగా తప్పుకుంది. దాంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రముఖంగా అనుష్క, కాజల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఇంకా తేలలేదు. కాజల్ తో పోలిస్తే... అనుష్కకే ఆ అవకాశాలున్నాయి. కాకపోతే స్వీటీ ఎంపిక అంత ఈజీ కాదు. ఎందుకంటే అనుష్క పారితోషికం ఇప్పుడు చుక్కల్లో ఉంది. తనని భరించడం ఎంత పెద్ద నిర్మాతకైనా కష్టమే. పైగా డేట్ల విషయంలో అనుష్క బాగా ఇబ్బంది పెడుతుంటుందని టాక్.
కాజల్ అయితే కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. పైగా ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌తో మంచి దోస్తీ ఉంది. ఖైదీ నెం.150 విజయంలో తానూ పాలు పంచుకుంది. అందుకే కాజల్ ఖరారైనా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చిరు - కాజల్ జంట కంటే, చిరు - అనుష్కల జంట చూడ్డానికి అభిమానులు ఎదురుచూస్తుంటారు. కాజల్ తో పోలిస్తే అనుష్క స్టార్ డమ్, రేంజ్ వేరు. పారితోషికం ఎంతైనా ఫర్వాలేదు అనుష్కనే తీసుకుందాం అనుకుంటే.. స్వీటీ ఫైనల్ అవుతుంది. ఆ ఒక్క విషయంలోనే ఆలోచిస్తే.. కాజల్ టీమ్‌లోకి వస్తుంది. అదీ మేటరు.