ముద్దుగుమ్మ అనుష్క అంతవరకూ జస్ట్ గ్లామర్ డాళ్ మాత్రమే. అలాంటి అనుష్క జేజమ్మగా కీర్తి పొందింది 'అరుంధతి' సినిమాతో. ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది ఈ సినిమాతో. అంతవరకూ అనుష్కపై ఉన్న అభిమానం వేరు. ఆ తర్వాత అనుష్క వేరు. అంతగా తన కెరీర్ని మలుపు తిప్పింది 'అరుంధతి' సినిమా. ఆ సినిమాలో అనుష్క తప్ప మరో హీరోయిన్ని ఊహించుకోవడం కష్టం. మళ్లీ ఆ తరహా సినిమా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కితే ఎలా ఉంటుంది అంటూ టాలీవుడ్లో కొందరు ప్రముఖ డైరెక్టర్స్ భావిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ డైరెక్టర్, మరో ప్రముఖ నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టుని టేకప్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా కథ ఫైనల్ కావాల్సి ఉంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు, హిందీలో కూడా ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని తెలియ వస్తోంది. 'అరుంధతి' సినిమాలో జేజమ్మ పాత్రని మించేలా ఈ సినిమాలో అనుష్క పాత్రని డిజైన్ చేస్తున్నారట. ఈ మధ్యే 'ఓం నమో వేంకటేశాయ' సినిమాతో 'కృష్ణమ్మ' మన ముందుకొచ్చింది జేజమ్మ. త్వరలోనే 'బాహుబలి ది కన్క్లూజన్'తో దేవసేనగా యుద్ధాలు చేయబోతోంది. ఇవి కాక మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'భాగ్మతి' ప్రాజెక్టు కూడా అనుష్క చేతిలో ఉంది. ఈ తరుణంలో మరో హీరోయిన్ ప్రాధాన్యత గల ఈ కొత్త ప్రాజెక్టు అనుష్క ముందు వాలబోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగాస్టాార్ చిరంజీవి కొత్త సినిమాలో కూడా అనుష్కనే హీరోయిన్గా పరిశీలిస్తున్నారు. సో లేటు వయసులో కూడా హీరోయిన్గా జేజమ్మ డేట్స్ అస్సలు ఖాళీ లేవన్న మాట.