బాహుబలి, భాగమతి తరవాత.. అనుష్క పెద్దగా సినిమాలు ఒప్పుకోలేదు. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. అయితే దానికి సంబంధించిన అప్ డేట్లు ఏం బయటకు రాలేదు. అనుష్క కూడా బయట అస్సలు కనిపించలేదు. ఈలోగా ఎన్ని సినిమా వేడుకలు, అవార్డు ఫంక్షన్లు జరిగినా అక్కడ అనుష్క దర్శన మివ్వలేదు. అనుష్క స్లిమ్ ట్రీట్‌మెంట్ తీసుకొంటోందని, అందుకే... బయట ఎక్కడా కనిపించడం లేదని అనుకొన్నారు. నవీన్ పొలిశెట్టి సినిమాలో అనుష్క ఇదివరకటికలా కనిపించబోతోందని, కొత్త అందాలతో మెరవబోతోందని చెప్పుకొన్నారు.
అయితే... అనుష్క ఈమధ్య మహా శివరాత్రి సందర్భంగా శివుని ఆలయాన్ని సందర్శించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో అనుష్క మరింత లావుగా కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అనుష్క తన ఫిట్నెస్ పై అస్సలు దృష్టి పెట్టడం లేదని, అసలు తనకు సినిమాలపై అసక్తి లేదని, అందుకే ఇలా తయారైందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓరకంగా ఆ కామెంట్లలోనూ నిజం ఉంది. అనుష్క చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే. పైగా చాలా కాలంగా తను కొత్త కథలేం వినడం లేదు. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఎప్పుడో ఒప్పుకొన్నదే. తప్పని పరిస్థితుల్లో ఈ సినిమా చేస్తోంది. సో... అనుష్క సినిమాలకు దూరం అవుతుందన్న ఊహాగానాల్లో ఎంతో కొంత నిజం ఉందన్నమాట.