టాలీవుడ్ కి అడ్డుకట్ట తెగిపోయింది. ఏపీలో టికెట్ రేట్లు సవరిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేసింది. టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉందంటూ తీర్పు ఇచ్చింది. దాంతో టాలీవుడ్ కి కొత్త ఉత్సాహం వచ్చినట్టైంది. ఈనెల 17న పుష్ప విడుదల అవుతోంది. ఆ సినిమాకి ఇది కచ్చితంగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అంతేకాదు.. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాలకు ఇది బంపర్ ఆఫర్.
నిజానికి సంక్రాంతి కి రిలీజ్‌డేట్లు ఫిక్స్ చేసుకున్నారు గానీ, నిర్మాతలెవరూ సంతృప్తిగా లేరు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల.. వసూళ్లలో కనీసం 40 శాతం గండి పడుతుంది. దాన్ని పూడ్చడం చాలా కష్టం. అఖండ అంత పెద్ద హిట్ అయినా.. ఏపీలో ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు. దానికి కారణం.. టికెట్ రేట్లు తక్కువగా ఉండడమే. బయ్యర్లు సంక్రాంతి సినిమాల్ని భారీ రేట్లకు కొనేశారు. వాళ్లంతా గుండెలు అరచేతుల్లో పెట్టుకుని హై కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్లందరి మొహాల్లో ఆనందం తాండవిస్తోంది.